హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసినట్టు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. శనివారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఈ విలీనం వల్ల విద్యార్థులు, అందులో పనిచేసే లెక్చరర్లకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు.
పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అప్‌గ్రేడ్ చేస్తున్నామని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ లాంటి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏనుగు ఎక్కి గడీలను పగలగొడ్తానని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ ఆ గడీల్లోనే ఆశ్రయం పొందారని ఎద్దేవా చేశారు.
